తమిళనాడులో 16వ శాసనసభ (2021-26)ను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ బుధవారం రద్దు చేశారు. ఈ నిర్ణయం ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతుండగానే, రాష్ట్ర 16వ శాసనసభ (2021-26)ను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ బుధవారం రద్దు చేశారు. ఈ నిర్ణయం ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈనెల 7న ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ సారథ్యంలోని టీవీకే ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్‌ను కలిసిన విజయ్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే, విజయ్ చూపిన సంఖ్యాబలంతో గవర్నర్ సంతృప్తి చెందలేదని, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది సభ్యుల మద్దతు లభించిన తర్వాత రావాలని సూచించినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది.
డీఎంకేతో పొత్తులో భాగంగా 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, విజయ్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే సంఖ్యాబలం 112కు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు అవసరమైంది. అయితే, అన్నాడీఎంకే పార్టీ, విజయ్‌కు మద్దతిచ్చే అవకాశాలను బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
డీఎంకే భాగస్వామ్య పార్టీలైన వీసీకే, వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు కూడా టీవీకేకు మద్దతు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఆరుగురు ఎమ్మెల్యేల బలాన్ని టీఎంసీ ఎలా కూడగట్టనుందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.











