పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికాయని బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ కొమరం భీమ్ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. రెబ్బెన, గోలేటి కేంద్రాల్లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని, ఇది పార్టీ సిద్ధాంతానికి, కార్యకర్తల నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలమని కేసరి ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాలుస్తూ, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీలకు మహిళలే తమ ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని, మహిళా శక్తి ఇప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారిందని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం పురోగమిస్తోందని, ప్రజలు పారదర్శకత, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని తెలిపారు.
కేరళ, తమిళనాడు ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 'నారీశక్తి ఎదిగితేనే దేశం ఎదుగుతుందని' నమ్మే బీజేపీ, మహిళల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వై కృష్ణకుమారి, కోశాధికారి కొనిపాక కిరణ్, రెబ్బెన మండల అధ్యక్షులు మల్రాజు రాంబాబు, జిల్లా నాయకులు గుల్బం చక్రపాణి, ఎలమంచి సునీల్ చౌదరి, కుందారపు బాలకృష్ణ, రాజు అగర్వాల్, ఇగురపు సంజీవ్, మండల నాయకులు దుర్గం తిరుపతి, కొయ్యడ మహేందర్ గౌడ్, పందిర్ల కనుకయ్య, పంబాల సత్తయ్య, ఎర్ర రాజేష్, నంది శేఖర్, యంసాని సతీష్, శ్రీనివాస్, జంగపెళ్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.











