లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటును మతపరమైన అంశాలతో ముడిపెట్టి మాట్లాడటం తెలంగాణపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తోందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో, చందానగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా మోసం చేస్తూనే, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా చందానగర్‌లో కాంగ్రెస్ నాయకులు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీ ఎంపీలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, తేజస్వి సూర్యను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











