తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతోందని, రాష్ట్రంలో నిధుల కొరత ఉందని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
సంగారెడ్డిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో నిధుల కొరత ఉందని అంగీకరించారని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలుస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేతలు నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం, ఆ తర్వాత హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారిందని ఎంపీ ఎద్దేవా చేశారు. నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళే అవసరం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పటికీ తెలంగాణలో వరి పంట దిగుబడి పెరిగిందని, దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు.
యుద్ధ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరగడం అనివార్యమని, అయితే ప్రపంచంలో పెట్రోల్ ధరలను పెంచని ఏకైక దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు. మే 10న హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.











