తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం, గత ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరించిందని, పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ప్రజల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బలవంతపు భూసేకరణ, నిరుద్యోగం, బీసీ రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఆదివాసీల భూ సమస్యలు, విభజన హామీలు, రైతులు, చేతివృత్తుల వారికి ఆదాయ భద్రత, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వివరించారు.
ప్రస్తుత రాజకీయాల్లో స్వలాభ రాజకీయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రజా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు.
త్రిబుల్ ఆర్, నిమ్స్ ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, ధరణి విధానంతో ఇబ్బందులు పడిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోదండరాం అన్నారు.
ఈ నెల 12న హైదరాబాద్ జలవిహార్ లో జరిగే తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












