సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): భం భం భోలే… హర హర మహాదేవ..” శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని, పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని అల్విన్ కాలనీలోని ఒడిశా వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోల్ భం కావడి యాత్ర భక్తి శ్రద్దలతో సాగింది. ఈ యాత్ర ఇంద్రేశం గ్రామ శివాలయం నుండి ఘంటానాదాలు, డప్పుల ఘోష, శంఖధ్వనుల మధ్య భజనల మధుర స్వరాలతో ప్రారంభమైంది. గంగాజలంతో నింపిన కావడిని భుజాన మోసుకున్న భక్తులు పాదయాత్రగా అల్విన్ కాలనీ శివాలయం చేరుకున్నారు. మార్గమంతా “భం భం భోలే… హర హర మహాదేవ! శంభో శంకర!” అంటూ శివుని నామస్మరణతో గగనం మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్‌చెరు అనేది మినీ ఇండియా అని, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఐక్యతతో జీవిస్తున్నారని అన్నారు. ఒడిశా వాసులు భక్తితో నిర్వహించిన ఈ యాత్ర పవిత్రతకు ప్రతీక అని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఒడిశా సంఘ సభ్యులు, స్వయంసేవకులు, యువతకు ప్రిథ్వీరాజ్ అభినందనలు తెలియజేస్తూ, భక్తులకు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలిపారు.
పటాన్‌చెరులో బోల్ భం కావడి యాత్రలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: August 11, 2025 8:38 pm