రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్: బనకచర్ల ప్రాజెక్టు వెనుక కుట్ర దాగి ఉందని, ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత చంద్రబాబు ప్రకటన చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజా భవన్ లో సమావేశం అనంతరం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాతనే ఈ ప్రకటన వచ్చింది.
గోదావరి నుంచి 200 టీఎంసీలు తరలించడానికి ఏపీ బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోంది. తెలంగాణ దగ్గరి నుంచి నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే చేతకాని సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారు. ఎందుకంటే నోట్ల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది.
చంద్రబాబుకు కేంద్రం మద్దతు ఉంది. అందుకే కేంద్రం, ఏపీ ఎలా చెబితే రేవంత్ రెడ్డి అలా ఆడతారు. తెలంగాణ మంచి కోరినట్లయితే చంద్రబాబు ప్రాజెక్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయకపోవడంతో అనుమానాలు నిజమయ్యాయి.
ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా ? ఈ విధంగా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?. రాష్ట్ర రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి రాయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయాలి.