సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం సామూహిక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ) జి.కల్పన తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గురుకుల ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, వస్త్రాలు, పుస్తకాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు JEE, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో బాలుర గురుకుల పాఠశాలలు హత్నూర, సింగూర్, న్యాల్కల్, నల్లవాగు, నారాయణఖేడ్‌లో ఉండగా, బాలికల గురుకుల పాఠశాలలు చిట్కుల్, ఇస్నాపూర్, రంజోల్, రాయికోడ్, అందోల్‌లో ఉన్నాయని వివరించారు. అర్హత గల అభ్యర్థులు సమీపంలోని మీసేవ లేదా ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలకు డీసీఓ కల్పన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ గురుకులాల్లో చదువుతో భవిష్యత్తుకు బలమైన పునాది: సంగారెడ్డి జిల్లా సమన్వయ అధికారి కల్పన
Published On: December 23, 2025 2:13 pm