సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళల, బాలికల భద్రతకు సంగారెడ్డి జిల్లా భరోసా పెద్దపీట వేస్తుందని, మహిళలు, పిల్లలు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా భరోసా 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలల రక్షణ కోసం ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ 28-ప్టెంబర్-2025 నాటికి విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, పోక్సో, అత్యాచార కేసులలో మహిళలు, బాలలకు మానసిక, చట్టపరమైన సహాయం అందించడంలో, న్యాయ సలహాలు ఇవ్వడంలో భరోసా సెంటర్ కీలకపాత్ర పోషించిందని, సిబ్బంది సేవలను ఎస్పీ అభినందించారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల సేవలను ఒకే గొడుగు క్రింద అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డిజిపి ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 28-సెప్టెంబర్-2020న ప్రారంభమైన భరోసా సెంటర్ గడిచిన ఐదు సంవత్సరాలు పోక్సో, అత్యాచార కేసులలో భాదిత మహిళలకు అన్ని రకాల సేవలందిస్తూ, జిల్లా ప్రజల మన్ననలు పొందడం జరుగుతుందని అన్నారు. భరోసా సెంటర్ లో శిక్షణ పొందిన సిబ్బంది, భాదిత మహిళలను అక్కున చేర్చుకొని వారిలో కొండత ధైర్యాన్ని నింపుతూ.., సమస్యలతో భరోసా సెంటర్ కు వచ్చిన వారికి నిష్ణాతులైన కౌన్స్లర్ లచే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, పోక్సో మరియు అత్యాచార కేసుల్లో భాదిత మహిళలకు అన్ని రకాల సేవలు (మెడికల్, లీగల్ మరియు కాంపెన్సేషన్) ఒకే వేదికగా అందిస్తూ, భాదితులకు బాధ నుండి విముక్తి కల్పిస్తూ సత్వర న్యాయం చేకూరేలా సేవలందిస్తున్న భరోసా సిబ్బంది సేవలను ఎస్పీ గారు కొనియాడారు. భరోసా సేవలు గడిచిన 5 సంవత్సరాల నుండి ఇప్పటివరకు నమోదైన 657 పోక్సో, అత్యాచార కేసుల్లో మెడికల్, లీగల్ సేవలను అందించడంతో పాటు 407 కేసులలో రూ:1,73,59,500/- కాంపెన్సేషన్, 24 మందికి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ రూ: 6,40,0000/-, తక్షణ పరిహారంగా డి.ఎల్.ఎస్.ఎ నుండి ఒక లక్ష రూపాయలను, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ క్రింద 50 మందికి రూ: 2,83,000/- ఇప్పించడం జరిగిందన్నారు. భరోసా సెంటర్ ద్వారా పోక్సో మరియు మహిళలపై అత్యాచార కేసులను నియంత్రించడానికి స్కూల్, కళాశాలలలో తరుచూ అవగాహన (ప్రెవేన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్) కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోక్సో కేసు నమోదు అయినప్పటి నుండి చివరి వరకు బాధితులకు అండగా వుంటూ, నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా ముఖ్య ఉద్ధేశ్యం అని అన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేయాలని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరం చేయడానికి వెనకడుగు వేస్తారని అన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎళ్లవేలలా పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉండాలని సూచించారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ తో విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పోలీసు శాఖ నుండి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా నోడల్ అధికారి/ అదనపు.ఎస్పీ రఘునందన్ రావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, ఎస్ఐ పూలబాయ్, జిల్లా ఇన్స్పెక్టర్స్ భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళల, బాలికల భద్రతకు సంగారెడ్డి జిల్లా భరోసా పెద్దపీట: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: October 15, 2025 3:55 pm