సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఎస్సీ కుటుంబంపై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రాంబాబు బుధవారం గ్రామాన్ని సందర్శించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి షెడ్డు కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను పూర్తిగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆరుగురిపై కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తమకు తెలిపారని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, చట్టప్రకారం తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని కమిషన్ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.ఈ ఘటనను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని, సామాజిక సమానత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. గ్రామాలలో నివసించే ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి, శాంతియుత వాతావరణంలో జీవించాలని కమిషన్ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఈనెల 30వ తేదీన సజ్జాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సివిల్ హక్కుల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సమానత్వం, న్యాయ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెరగాలని తెలిపారు. అంతకు ముందు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు, కోహిర్ మండల కేంద్రంలోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహాల పరిసర ప్రాంతాలను పరిశీలించి, భద్రత దృష్ట్యా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నదీ లేదీ వివరంగా ఆరా తీశారు. మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చదువుపై దృష్టి సారించి, పదో తరగతిలో జిల్లాకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని అధికారులకు సూచించారు. అనంతరం కోహిర్ మండలంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని కమిషన్ చైర్మన్, సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబుకు అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ… సమాజంలో సమానత్వం, న్యాయం, సామరస్యాన్ని కాపాడటమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ, ఇంచార్జ్ డిపిఓ జానకిరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, షెడ్యూల్ కులాల సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సజ్జాపూర్ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ
Updated On: December 24, 2025 5:48 pm