పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాలు అమ్మకం

పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాలు అమ్మకం

78 చోట భూములు గుర్తించిన ప్రభుత్వం

ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సిఎం సూచన

సదుపాయాల కల్పనకు పదేళ్లలో లక్ష కోట్లు అవసరమని అంచనా

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన పేరుతో భూముల అమ్మకానికి ప్రభుత్వం తెరలేపింది.

దీనిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 78 చోట్ల 1,343 ఎకరాలు అమ్మకానికి పెట్టింది. రానున్న పదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పట్టణ సంస్కరణలు అమలు చేయడం ద్వారా కేంద్రం నుండి కొంత నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సిఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. వీటిలో గ్రోత్‌ హబ్స్‌, నగరాల పునరాభివృద్ధి, శానిటేషన్‌ ప్రాజెక్టులతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నిధుల సమీకరణకు పిపిపి పద్ధతిని అమలు చేయడంతో ల్యాండ్‌ మానిటైజేషన్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం 18 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 78 చోట్ల భూములను గుర్తించింది. ఇలా అమ్మడానికి పెట్టిన స్థలాల్లో ఎసైన్డ్‌, డికెటి, డిపట్టా భూములు 28 ఉన్నాయి. 45 చోట్ల ప్రభుత్వ, పట్టణాభివృద్ధి సంస్థలకు చెందిన భూములున్నాయి. వాటిని అమ్మడం లేదా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా అప్పగించిన భూముల్లో పట్టణాభివృద్దిశాఖల ప్రమేయం ఏ మాత్రమూ ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. పిపిపి పద్ధతిలో అప్పగించే భూముల్లో ప్లాట్ల అభివృద్ధి, గేటెడ్‌ కమ్యూనిటీ, వేర్‌హౌసింగ్‌, ఫ్యూయల్‌ స్టేషన్లు, హాస్పిటళ్లు, వాణిజ్యభవనాలు, సోలార్‌ పార్కులు, హోటళ్లు, రిసార్టులు, హబ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఆయా సంస్థల పరిధిలో వేర్వేరు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూమిని కూడా యుడిఏకు అప్పగించడం వంటి పనులు పూర్తయ్యాయి. వాటికి ఎసెస్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. అలాగే 78 చోట్ల గుర్తించిన వాటిల్లో 73 సైట్లకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాటిల్లోనూ 33 చోట్ల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని, 27 చోట్ల పరిశీలన చేయాల్సి ఉందనీ ఈ మొత్తంలో 1275 ఎకరాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉందనీ నివేదిక రూపొందించింది. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ణణాభివృద్ధిశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

*ఎక్కడ …ఎన్ని ఎకరాలు*

వీటిల్లో శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో 8 చోట్ల 159.38 ఎకరాలు, బొబ్బిలి యుడిఏలో 10 చోట్ల 44.38 ఎకరాలు, అమలాపురం యుడిఏలో 2 చోట్ల 5జ10 ఎకరాలు, రాజమహేంద్రవరం పరిధిలో 3 చోట్ల 66.49 ఎకరాలు, కాకినాడలో 4 చోట్ల 31.51 ఎకరాలు పిపిపి పద్ధతిలో మానిటైజేషన్‌ ప్రక్రియకు కేటాయించారు. వీటితోపాటు ఏలూరులో నాలుగు చోట్ల 164.03 ఎకరాలు, మచిలీపట్నం పరిధిలో మూడు చోట్ల 35.76 ఎకరాలు, బాపట్ల యుడిఏ పరిధిలో రెండుచోట్ల 5.25 ఎకరాలు, పల్నాడు పరిధిలో ఒకచోట 40 ఎకరాలు, ఒంగోలులో మూడుచోట్ల 25.94 ఎకరాలు, నెల్లూరులో ఒకచోట 34 ఎకరాలు, తిరుపతిలో ఐదుచోట్ల 167.12 ఎకరాలు, చిత్తూరులో 8.54 ఎకరాలు, పలమనేరు, కుప్పం, మదనపల్లె యుడిఏ పరిధిలో నాలుగు చోట్ల 76.46 ఎకరాలు పిపిపికి ఇవ్వనున్నారు. పుట్టపర్తి పరిధిలో ఆరుచోట్ల 40.64 ఎకరాలు, అనంతపురం, హిందూపురం యుడిఏలో 11 చోట్ల 229.39 ఎకరాలు, అన్నమయ్య, కడప యుడిఏలో ఆరచోట్ల 114.39 ఎకరాలు, కర్నూలులో నాలుగు చోట్ల 95 భూములను అమ్మడంగానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంగానీ చేయాలని నిర్ణయించారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment