అంతా మీ ఇష్ట‌మేనా? ష‌ర్మిల‌పై సీనియ‌ర్ల విసుర్లు.. !

అంతా మీ ఇష్ట‌మేనా? ష‌ర్మిల‌పై సీనియ‌ర్ల విసుర్లు.. !

కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సీనియర్ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో అంతర్గత విమర్శలు ఎదుర్కొంటున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడు మరో చిక్కు వచ్చింది. ఇటీవల ఆమె తన కుమారుడిని వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వైసిపికి అలాగే షర్మిలకు మధ్య మాటల తూటాలని పేల్చేలా చేశాయి. ఇది ప్రత్యేక విషయం. అయితే అసలు షర్మిల ప్రకటన పై సొంత పార్టీలోనే సీనియర్ నాయకులు విభేదిస్తున్నారు. ఎవరిని అడిగి రాజారెడ్డిని అంటే తన కుమారుడిని రాజకీయ వారసుడిగా.. షర్మిల ప్రకటించారనేది అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

ఎందుకంటే షర్మిల ఆధ్వర్యంలో పార్టీ ఇప్పటికే పైకి పుంజుకోవాల్సింది పోయి జారుడు బండపై ప్రయాణం చేస్తున్నట్టుగా ఉందన్నది నాయకులు చెబుతున్న మాట. ఇటువంటి సమయంలో అనవసరమైన వివాదాలు తీసుకువచ్చి ఇంకా అసలు జెండా కూడా పట్టుకోవడం రాని కుమారుడిని వారసుడిగా కోరుకుంటూ పార్టీ కీలక కార్యక్రమాల్లో అతన్ని తీసుకువెళ్లడంపై సీనియర్ నాయకులు అంతర్గతంగా విభేదిస్తున్నారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం వంటి నాయకులు

ఏం చేస్తాం మా పరిస్థితి అట్లా ఉంది

అని వ్యాఖ్యానించటం విశేషం.

అలాగ‌ని, అటు నేరుగా ఆమెతో విభేదించను లేరు.. ఇటు ఆమెను సమర్ధించడం లేని పరిస్థితిని కొంతమంది నాయకులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పార్టీలో కీలక బాధ్యత వహిస్తున్న షర్మిల వల్ల పార్టీ గ్రాఫ్ పెరగాలి. ప్రజల్లో పేరు రావాలి. ఈ రెండు లేకపోగా ఏడాదిన్నర కాలంగా ఆమె చేస్తున్న రాజకీయాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి అన్న చర్చ నడుస్తుంది. ఇప్పుడు రాజారెడ్డి ప్రకటన కూడా కేవలం తన అన్నను టార్గెట్ చేసుకుని చేశారే తప్ప కాంగ్రెస్ అభివృద్ధికి కానీ కాంగ్రెస్ పురోభివృద్ధికి కానీ ఆమె ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నది సీనియర్లు చెబుతున్న మాట.

ఈ క్రమంలోనే సీనియర్ నాయకులు తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలా ఎలా ప్రకటిస్తారని పార్టీ అధిష్టానం అంటూ ఒకటి ఉంటుందని, అసలు పార్టీ అధిష్టానానికి కూడా పరిచయం చేయకుండానే వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజారెడ్డిని ప్రకటించడం ఏంటని కొంతమంది నాయకులు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. పార్టీ అంటే షర్మిల ఇష్టానికి వచ్చినట్టు చేయడం కాదని, అధిష్టానం చెప్పినట్టు వినడం, ప్రజలకు అనుకూలంగా ఉండడం అనే రెండు పట్టాలపై ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు.

ఇవేవీ కాకుండా సొంత అజెండాను ఏర్పాటు చేసుకొని అన్నపై యుద్ధాన్ని మరింత పెంచాలని రీతిలో షర్మిల చేస్తున్న ఈ ప్రకటనలు, ప్రయత్నాలు పార్టీని మరింత ఇరకాటంలోకి నడతాయ‌న్నది వారి భావన. అందుకే ఇక భరించలేమని చాలామంది నాయకులు ఇళ్ల‌కే పరిమితం అయిపోతున్నారు. షర్మిల ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా స్థానికంగా ఒకరిద్దరు నాయకులు తప్ప సీనియర్ నాయకులు అందరూ దూరంగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment