సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంక్రాంతి పండగ సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు వస్తుండటంతో చాలా వరకు సొంత గ్రామాలకు కానీ, ఇతర ప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు.. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణాలలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి, పరిమిత వేగంలో ప్రయాణం చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.
*జిల్లా ప్రజలకు పోలీసు వారి సూచనలు..*
*ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం.
*ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారిని ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి.
*విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
*ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
*ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.
*ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
*సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది.
*ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి.
*అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.
*సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది.