నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో త్వరలో జరగనున్న ఐపీఎల్-2026 మ్యాచ్ల నేపథ్యంలో, ఇన్-చార్జ్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్టేడియంను సందర్శించి, భద్రత, ట్రాఫిక్ మరియు ఇతర కీలక ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మ్యాచ్ల సజావుగా నిర్వహణ కోసం సుమారు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో శాంతి భద్రతల విభాగంతో పాటు ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ మరియు క్రైమ్ టీమ్స్ సమన్వయంతో పనిచేస్తాయి.
స్టేడియం లోపల, బయట 450 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయగా, మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ పహారా కాస్తాయి. ఈవ్-టీజింగ్ లేదా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రేక్షకులు మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియం చేరుకోవాలని సూచించారు. మ్యాచ్ అనంతరం సులభంగా గమ్యస్థానాలకు చేరుకునేలా మెట్రో రైలు సర్వీసులను అర్థరాత్రి వరకు పొడిగించాలని మెట్రో అధికారులను కోరారు.
భద్రతా దృష్ట్యా స్టేడియం లోపలికి నీళ్ల సీసాలు, తినుబండారాలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, సిగరెట్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, హెల్మెట్లు, బ్యాగులు మరియు బ్యానర్లు వంటి కొన్ని వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అభిమానులు భద్రతా తనిఖీలకు సహకరించాలని సీపీ కోరారు.










