సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): కనిపించే దేవుడే వైద్యుడు అని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయని (వైద్యో నారాయణో హరి) రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో
రూ.23.75 కోట్లతో 50 బెడ్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ను, రూ.186 కోట్లతో మెడికల్ కాలేజీ, హాస్టల్స్ లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. రూ . 273.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 500 పడకల సామర్ధ్యం గల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో కళాశాల ఆడిటోరియంలో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య వృత్తికి ఎంతో పవిత్ర మైన వృత్తిగా ప్రజలు భావిస్తారని, వైద్యుడిని దేవునితో సమానంగా చూస్తారని మంత్రి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో గతంలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు అయ్యేవారని అలాంటి పరిస్థితిని మార్చేందుకు కోసం ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందజేయడం కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని మంత్రి అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వం వైద్య కళాశాలలో ప్రభుత్వం అదునాతన వసతులతో కూడిన 50 పడకల క్రిటికల్ కేర్ వార్డును ప్రారంభించిందని అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల్లో గుర్తింపు పొందాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా నుండి ఒక్క రోగి కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లకుండా స్థానికంగానే చికిత్స అందించేలా రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు సంగారెడ్డి వైద్య కళాశాల, ఆసుపత్రులలో అందేలా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిఎస్ఆర్ నిధులకు మౌలిక వసతుల మెరుగు కోసం ప్రత్యేక చర్య చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వైద్య విద్యార్థులు మంచి నైపుణ్యం గల వైద్యులుగా రూపొంది ప్రజలకు సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగామెడికల్ కాలేజీ విద్యార్థుల ఉద్దేశించి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ… యువ డాక్టర్లు అందరు రాజకీయాలకు రావాలని, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, విద్యావంతులు రాజకీయాలకు వస్తే దేశం మరింత పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమము లో హెల్త్ సెక్రటరి డా. క్రిస్టినా, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ , డా.సంజీవ రెడ్డి, మాణిక్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు, వైద్య కళాశాల అధికారులు, వైద్యశాఖాధికారులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On: September 4, 2025 6:20 pm