సంస్కారం లేని విద్య నిరార్ధకం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా గొల్ల అంజయ్య పదవీ స్వీకారం

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంస్కారం లేని విద్య నిరార్థకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా గొల్ల అంజయ్య పదవి బాధ్యతల చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం అనంతరం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పీఎస్ఆర్ గార్డెన్ లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో నేను, నాది, నా కుటుంబం, నా సంపాదన అనే భావం ఉంటున్నదని ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. గతంలో ప్రజలలో మనం అనే భావన ఉండేదని మనం అనే భావన ఏకతకు బాటలు వేస్తుందన్నారు. పిల్లలకు విద్యతో పాటు సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్నారు .సంస్కారం లేని విద్య నిరార్థకం అన్నారు. విద్యతోపాటు విద్యార్థులకు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే వివేకం అందించేది పుస్తకాలు మాత్రమేనని అన్నారు. మన దేశ స్వతంత్ర ఉద్యమంలో గ్రంధాలయాలు కీలకంగా పని చేశాయన్నారు. గ్రంధాలయాల ద్వారా చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారు అన్నారు. ప్రతి వ్యక్తిలో ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పెరిగితే విప్లవాలు వస్తాయన్నారు. అదే ప్రశ్నించే తత్వం పెరిగితే ప్రజాస్వామ్యం పరిడ విల్లుతుందన్నారు. దీంతో దేశం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. నేడు ప్రతి ఒక్కరూ సెల్ ఫొన్ లకు బానిసలు అవుతూ పుస్తకాలకు దూరమవుతున్నారన్నారు.
పత్రికల్లో వచ్చే ప్రాధాన్యమైన వార్తలు సంపాదకీయం చదవడం లేదని వాట్సప్ చూస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి జీవన విధానాన్ని పుస్తకాలు మారుస్తాయని ఆ తర్వాత కుటుంబమే మారుస్తుందని తెలిపారు. మహనీయులంతా పుస్తకాలతో గడిపి సమాజానికి మార్గదర్శకులుగా మారారన్నారు. రాజకీయాలంటే ఎన్నికలు ఓట్లు కొనుగోలు పదవులు కాదని భవిష్యత్తు గురించి ఆలోచన ఉండాలని సమాజానికి సేవ చేయాలనే తపన ఉండాలన్నారు. సిఆర్ఎఫ్ నిధులతో గ్రంథాలయాలకు పుస్తకాలు తెప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రంధాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో పుస్తకాల కొరత ఉందని గత పది సంవత్సరాల నుండి గ్రంధాలయ సెస్ సెస్ ప్రభుత్వం నుండి రావడం లేదన్నారు. సిబ్బంది నియామకాలు లేక గ్రంధాలయాల నిర్వాహనకు ఇబ్బంది ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గ్రంధాలయాల లో సమూల మార్పులు తీసుకొచ్చి రాబోయే రెండేళ్లలో జ్ఞాన సమాజాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now