సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి తోడ్పాటు అందిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పీ.ఎస్.ఆర్. గార్డెన్‌లో శనివారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 341 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని అన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం స్థాపించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి లబ్ధిదారుని దగ్గరికి ప్రభుత్వ పథకాల ఫలితం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండలంలో – 41 మంది, కొండాపూర్ మండలం – 83, సదాశివాపేట – 46, సంగారెడ్డి మండలంలోని – 171 మంది,మొత్తం 341 మంది లబ్దిదారులకు 3కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లతో కలిసి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీవో రాజేందర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో మహిళల ఆర్థిక భద్రతకు తోడ్పాటు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On: October 25, 2025 7:05 pm