అక్రెడిటేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి సోమవారం వరకు మాత్రమే గడువు ఉందనే వార్తలను టీయూడబ్ల్యూజే (ఐజెయు) నాయకులు ఖండించారు. గడువు ఇంకా ఉందని, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టీయూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకు సోమవారం వరకు మాత్రమే గడువు అనేది అవాస్తవమని వారు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదని, వాటి ఏర్పాటుకు, సమావేశాలు నిర్వహించడానికి సమయం పడుతుందని నాయకులు తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం కూడా జరగాల్సి ఉందని, ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే కార్డుల జారీపై స్పష్టత వస్తుందని వివరించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందేలా కొన్ని మార్గదర్శకాలు రానున్నాయని, ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తొందరపాటు వల్ల దరఖాస్తుల్లో తప్పులు దొర్లి, తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రెండు సంవత్సరాల తర్వాత కొత్త కార్డులు రానున్నాయని, అర్హులైన వారందరికీ కార్డులు అందాలని యూనియన్ నాయకులు ఆకాంక్షించారు. గడువు ఇంకా ఉన్నందున తొందరపడకుండా, సరైన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.












