రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన దూరదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
అంబేద్కర్ జీవితం నుండి ప్రేరణ పొందాలని, రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను నిలబెట్టడానికి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.







