కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని సమర్పించారు. వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసానికి మంగళవారం వచ్చిన ఆశా వర్కర్లు, తమ గౌరవ వేతనం, క్రమరహిత చెల్లింపులు, అధిక పనిభారం, ప్రోత్సాహకాల జాప్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ఆశా వర్కర్ల సేవలను షబ్బీర్ అలీ కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలను ప్రశంసించారు.
ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, కనీస వేతన పెంపు, స్థిరమైన వేతన విధానం, పింఛన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, సిఐటియు ప్రతినిధులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.












