బిఆర్ఎస్ పార్టీ తన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు, ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాలలో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, ఈలోగా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అధికార కాంగ్రెస్ పార్టీని, అలాగే కవిత పార్టీని లక్ష్యంగా చేసుకుని దూకుడు పెంచాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా కేసీఆర్ కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో పార్టీలో మరిన్ని ఊహించని మార్పులు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు పోరుబాటకు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిందని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెట్టే అవకాశం ఉంది.








