దేశ భవిష్యత్తు ప్రణాళికలకు జనగణన అత్యంత కీలకమని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి హెచ్చరించారు. మేడ్చల్ మండలం ఎల్లంపేటలో జరిగిన జనగణన శిక్షణ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పథకాల అమలు, వనరుల కేటాయింపు వంటివి ఖచ్చితమైన జనాభా గణాంకాలపై ఆధారపడి ఉంటాయని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. దేశాభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాల సేకరణ అత్యవసరమని, ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనగణన నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలపై శిక్షణార్థులకు పలు సూచనలు చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో జనగణన నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. పారదర్శకంగా డేటా సేకరణ జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామి, ఎలక్షన్ సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ అనుష, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమార్ తదితర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











