తెలంగాణలో మహిళల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 'స్టాండ్ విత్ హర్' (ఆమె కోసం నిలబడండి) అనే వినూత్న కార్యక్రమాన్ని కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో ప్రారంభించారు.
తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, సాంకేతికత పెరిగిన నేపథ్యంలో మహిళలపై వేధింపులు పెరిగాయని, చట్టాల బలోపేతం, రక్షణ చర్యలతో పాటు వ్యక్తిగత బాధ్యత కూడా కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని డా. సత్యం శ్రీరంగం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తున్నామని, వ్యాపార రంగంలోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారి ఆర్థిక స్వావలంబనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్ కూడా ఉన్నారు.

