తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ప్రతి మహిళ పట్ల గౌరవం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేవలం వేడుకలు జరుపుకోవడం సరిపోదని ఆయన అన్నారు.
కేపీహెచ్బీలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణను మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే “స్టాండ్ విత్ హర్” కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే భావన ప్రతి ఒక్కరిలో రావాలని ఆయన ఆకాంక్షించారు.
మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందని సీఎం పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన సూచించారు. మహిళలు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకుని ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మహిళల భాగస్వామ్యంతోనే ఆర్థికంగా ముందున్నాయని సీఎం ఉదహరించారు. మహిళలు ధైర్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్వీకరించాలంటే వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదేనని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

