రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, సిద్దిపేటలో ఆయన ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో హరీశ్ రావు మాట్లాడుతూ, వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 28 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, ఇది రైతుల జీవితాలతో ఆడుకోవడమేనని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుత ప్రభుత్వం వారిని తీవ్రంగా వేధిస్తోందని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, ధాన్యం సేకరణ జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బ కారణంగా రైతులు వరి కుప్పలపైనే మరణిస్తున్నారని, ఈ దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.
గతంలో వడ్లు కొనుగోలు చేసినట్లే, ఇప్పుడు కూడా సకాలంలో కొనుగోలు చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ధాన్యం కొనుగోలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.











