డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంతో పాటు బాలల భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లాలో “బాలల భద్రత–డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు కొనసాగుతాయి.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న ఈ వారోత్సవాల సందర్భంగా, జిల్లాలోని 8 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పాండు ప్రారంభించారు. పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు అందించడం ఈ ప్రక్రియలో భాగం.
16 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ఈ సేవలు అందజేయడంతో పాటు, 18 సంవత్సరాలు నిండిన వారికి డీఆర్డీఏ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వ పర్యవేక్షణలో అందుతున్నాయని, సేవల నాణ్యతను ప్రతి నెలా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 10 మంది పిల్లలకు ఆఫ్టర్ కేర్ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు.












