పేదల స్వంత ఇంటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని బస్వాపురంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు బస్వాపురం మల్లమ్మ–మల్లయ్య, విజయలక్ష్మి–జగదీశ్వర్ ల ఇందిరమ్మ ఇంటిని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇల్లు కల నిజమవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. పేదల గృహావసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ఎవరూ ఇల్లు లేకుండా ఉండకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అందోల్ - జోగిపేటలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్ రేఖ–ప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












