కామారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న కల్లు దుకాణాలపై అధికారులు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే మిగిలిపోయాయని, కల్తీ కల్లు విక్రయాలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కేవలం రెండు కల్లు దుకాణాలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ దుకాణాల్లో నాణ్యతలేని పదార్థాలతో కల్లును కల్తీ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
కల్తీ కల్లు తయారీలో నిద్రమాత్రలు, డైజీపామ్ వంటి మత్తు మందులు, ఇతర రసాయనాలు, కృత్రిమ మత్తు పదార్థాలు వంటి ప్రమాదకరమైన వాటిని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ కల్లు సేవించడం వల్ల తలనొప్పి, వాంతులు, మత్తు, శరీర నిస్సత్తువ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గతంలో అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, తాత్కాలికంగా దుకాణాలను మూసివేయించి, ఆ తర్వాత మళ్లీ యథాస్థితి కొనసాగడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చుక్కాపూర్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కూడా అనుమతి లేకున్నా కల్తీ కల్లు విక్రయిస్తున్నారని భక్తులు పేర్కొంటున్నారు.
అనధికారిక కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కల్తీ కల్లు విక్రయాలను పూర్తిగా అరికట్టాలని స్థానికులు, భక్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.







