సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించి, పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ సందర్భంగా, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న లబ్ధిదారురాలు పిల్లి సాయవ్వతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ద్వారా సురక్షితమైన నివాసం కలగబోతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాను గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రతి కుటుంబానికి సురక్షితమైన గృహం అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లలో పూరి గుడిసెలో ఉన్నవారిని గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయాలని, ఎక్కడా కూడా పూరి గుడిసెలు కనిపించకూడదని, అధికారులు ప్రతీ గ్రామాన్ని పర్యటించి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో రూ.1.59 కోట్లు 45 లక్షల బ్యాంకు రుణాలను 90 మంది లబ్ధిదారులకు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.








