కామారెడ్డి పట్టణంలోని టెక్రియాల్లో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.
కామారెడ్డి పట్టణంలోని టెక్రియాల్లో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించారు. కుటుంబాలకు వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతోందని పేర్కొన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం అని, ఆ గౌరవాన్ని ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందజేస్తూ సొంతింటి కలలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమాన ప్రాధాన్యతతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












