కామారెడ్డి జిల్లాలో జనాభా గణన–2027లో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వీయ గణనను లాంఛనంగా ప్రారంభించి, సెన్సస్ పోర్టల్లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈసారి జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వీయ గణనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ, 2011 తర్వాత జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడిందని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెన్సస్–2027ను ప్రారంభించామని తెలిపారు.
స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ మొబైల్, కంప్యూటర్ లేదా టాబ్ ద్వారా సెన్సస్ పోర్టల్లో స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఖచ్చితమైన జనాభా గణాంకాల ఆధారంగా మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించడానికి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి స్వీయ గణన ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు 100 శాతం స్వీయ గణనలో పాల్గొని, తప్పులేకుండా వివరాలు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జనాభా గణనలో మొదటి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్) ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు, రెండవ దశ (జనాభా గణన) ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుంది. స్వీయ గణనలో సెన్సస్ పోర్టల్లో 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. నమోదు అనంతరం జనరేట్ అయ్యే SE IDని భద్రపరచుకోవాలి.











