కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఫైర్ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నిజాంసాగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న విశాల షాపింగ్ సెంటర్లో అగ్ని భద్రతా తనిఖీలు నిర్వహించడంతో పాటు, సిబ్బందికి అగ్నిమాపక యంత్రాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో, షాపింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన అగ్ని భద్రతా పరికరాలు, నివారణ వ్యవస్థలు, అత్యవసర స్పందన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. భవనంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
విశాల షాపింగ్ సెంటర్ సిబ్బంది కోసం “ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్” పై ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో 26 మంది సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక యంత్రాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.
తనిఖీల అనంతరం, షాపింగ్ సెంటర్ యాజమాన్యానికి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, అగ్నిమాపక పరికరాలను నిరంతరం సంరక్షించుకోవాలని, సిబ్బందికి తరచూ శిక్షణలు నిర్వహించాలని సూచనలు జారీ చేశారు.
అగ్ని ప్రమాదాలను నివారించడానికి నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యవసరమని, ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి ఫైర్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని జిల్లా ఫైర్ అధికారి పేర్కొన్నారు.












