కామారెడ్డి జిల్లాలో బాలికల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా 'స్నేహ సమ్మర్ క్యాంప్-2026'ను సెర్ప్-డీఆర్డీఏ ఆధ్వర్యంలో మే 2 నుంచి జూన్ 10 వరకు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నిరోధం, ఆరోగ్యం, విద్య, కెరీర్ వంటి 13 అంశాలపై అవగాహన కల్పించడమే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశ్యం.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్యాంప్ పోస్టర్, గైడ్బుక్లను ఆవిష్కరించారు. బాలికలు భవిష్యత్తుకు శక్తి అని, బలహీనులు కాదని ఆయన పేర్కొన్నారు. బాల్య వివాహాల నిరోధం, ఆరోగ్యం, విద్య, కెరీర్ మార్గదర్శనం, సైబర్ భద్రత, స్వయం రక్షణ వంటి కీలక అంశాలపై బాలికలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
కిషోర బాలికల కోసం 715 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 305 సంఘాలు ఏర్పడి 42.7 శాతం పురోగతి సాధించారు. రాజంపేట, బిబిపేట, తాడ్వాయి మండలాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి.
మిగిలిన మండలాల్లోనూ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, క్యాంప్‌ను విజయవంతం చేయాలని సూచించారు.











