తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
కవిత మాట్లాడుతూ, "బీఆర్ఎస్ లో ఉండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా. ఆనాటి ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉంది. నన్ను క్షమించాలని కోరుతున్నా" అని అన్నారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏజెన్సీలకు కొమ్ముకాస్తూ 5 లక్షల మందికి అన్యాయం చేస్తోందని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్ వీధుల్లో 5 లక్షల మంది ఉద్యోగులు మార్చ్ చేస్తే వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని కవిత పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు జాగృతి వారికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆమె హెచ్చరిక జారీ చేశారు. కోదండరాం, హరగోపాల్ వంటి మేధావుల మౌనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు.
జాగృతి అధికారంలోకి వస్తే, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని భావించామని, కానీ విచిత్రంగా కొన్ని డిపార్ట్మెంట్లలో పర్మినెంట్ ఉద్యోగులే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయ్యారని ఆమె అన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్లలో జరిగిన వ్యవహారాలు ఇందుకు ఉదాహరణలని ఆమె పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామిని అయినందున, ఆనాటి పాపంలో తనకు భాగం ఉందని, అప్పుడు ఉద్యోగుల జీవితాల్లో మార్పు తేలేనందుకు వారి చెల్లిగా క్షమాపణ కోరుతున్నానని కవిత అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవటం లేదనే కారణంతోనే కాంగ్రెస్ ను గెలిపించారని, అయితే రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేకపోయినా, కోదండరాం, హరగోపాల్ చెప్పారని కాంగ్రెస్ కు మద్దతిచ్చారని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వంపై రూపాయి భారం లేకుండా న్యాయం చేయవచ్చని ఉద్యోగులు చెబుతున్నా, ప్రభుత్వం ఏజెన్సీలకు కొమ్ముకాస్తూ వారిని పట్టించుకోవటం లేదని విమర్శించారు.







