తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో అడ్డంకులు సృష్టిస్తున్న పలు జీవోలను రద్దు చేయాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల తొలగింపుపై కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవోను అడ్డుపెడుతూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి జీవో నంబర్ 4, డీఎస్సీకి జీవో నంబర్ 104, గ్రూప్స్‌కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81లు నియామకాలకు ఆటంకాలుగా మారాయని కవిత పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించిన కవిత, ప్రభుత్వం వచ్చాక బాలింతలకు ఇచ్చే డబ్బులు, కిట్లు, అంగన్ వాడీలకు జీతాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలకు నిధులు విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టుకు 7 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు.
ఇదే సమయంలో, రేషన్ కార్డుల తొలగింపుపై కూడా కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన, చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారి రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నం చేయడం పైశాచిక చర్య అని, దీనిని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. తమ హామీలను నెరవేర్చకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.







