తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని పరామర్శించారు. ఈ సందర్భంగా, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రొఫెసర్ల పరిస్థితిపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బంజారాహిల్స్‌లోని వెల్ నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ప్రొఫెసర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితిని కవిత అడిగి తెలుసుకున్నారు. ఆయన అనారోగ్యానికి దారితీసిన కారణాలు, అందుతున్న చికిత్స గురించి వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ప్రొఫెసర్ అన్సారీ యూనివర్సిటీలో అక్రమాలను బయటపెట్టడంలో, విద్యార్థుల హక్కుల కోసం పోరాడటంలో కీలక పాత్ర పోషించారని కవిత గుర్తు చేసుకున్నారు. 2023లో రిటైర్ అయినప్పటికీ, ఆయనకు ఇప్పటివరకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందలేదని, అనారోగ్యంతో ఉన్నప్పుడు చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని, ఇదే విధంగా దాదాపు 143 మంది ప్రొఫెసర్లు, రిటైర్ అయిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి వేచిచూస్తున్నారని కవిత తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను తక్షణమే అందించాలని, వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె కోరారు.











