ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అభివర్ణించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిని 2014లో సుమారు 800 పేద కుటుంబాలకు కేటాయించారని, అప్పటి నుంచి వారు అక్కడే నివసిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు తెలిపారు. కనీస వసతులు కల్పించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన రాలేదని, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ ఇళ్ల కూల్చివేత జరగడం చట్ట విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు 4 వేల పోలీసులతో, 200 బుల్డోజర్లతో తెల్లవారుజామున ఇళ్లను కూల్చివేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు. భూదాన్ బోర్డు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్లు నకిలీ అని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, హైకోర్టు ఆరు సార్లు బాధితులకు అనుకూల ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
భూదాన్ ఉద్యమం వినోబా భవే పిలుపుతో ప్రారంభమైందని, 1954లో కల్వల రాజారావు దానం చేసిన భూమి ఇది తప్ప ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో సుమారు 1.80 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలోనే 28 వేల ఎకరాల భూదాన్ భూములపై పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లకు సంబంధించిన పూర్తి రికార్డులను బహిర్గతం చేయాలని, కూల్చివేసిన ఇళ్లను తిరిగి నిర్మించి పేదలకు గౌరవప్రదమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

