ఖానాపూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆమె అభివృద్ధి పనులపై సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, పంచాయతీరాజ్, R&B శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల పనుల్లో జాప్యం చేయరాదని, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అటవీ శాఖ అనుమతులు అవసరమైన పనుల కోసం 'పరివేశ్' పోర్టల్‌లో సత్వరమే దరఖాస్తులు సమర్పించాలని ఆదేశించారు.
ఖానాపూర్ పట్టణ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమగ్ర సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను కోరారు. అటవీ క్లియరెన్స్ విషయంలో వేగంగా స్పందించాలని, అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పనుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీఓ రత్నకళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

