మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రావతితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి సుమారు 89 దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్లు స్పష్టం చేశారు.
ఏదైనా దరఖాస్తును నిబంధనల ప్రకారం తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా, వివరంగా తెలియజేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని హెచ్చరించారు.











