తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయమే అంతిమమని, కోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.
రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టు తన విచారణను ముగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ పై గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
స్పీకర్ నిర్ణీత గడువులోగా పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ సమస్య సభాపతి కార్యాలయంలోనే ముగిసిపోయిందని ఆయన పేర్కొన్నారు.
సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నందున ఈ కేసులో విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో కోర్టు విచారణ ముగిసినట్లేనని వెల్లడించింది.
అనంతరం, స్పీకర్ ఆదేశాలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రచురించాలని, పిటిషనర్లకు అవసరమైన పత్రాలను నాలుగు రోజుల్లో అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

