రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ రామకృష్ణారావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిందని, దీనిని అన్ని స్థాయిలలో అమలు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న జిల్లా కేంద్రాలలో సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు శిక్షణ ఇస్తామని, ఇందులో వారి బాధ్యతలు, పాత్రపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై కూడా ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ల సహాయంతో శిక్షణను సులభంగా అర్థమయ్యేలా నిర్వహించాలని రామకృష్ణారావు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, త్రాగునీటి సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

