ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని, ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యవసరమని ఆమె నొక్కి చెప్పారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై ప్రజలు తమ విజ్ఞప్తులను అధికారులకు అందజేశారు.
జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు అందించిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.












