ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని రాంపల్లి శివారులో ప్రధాన రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా షెడ్డు నిర్మాణం జరుగుతోందని, దీనిపై సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాంపల్లి శివారులో జరుగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణంపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆరోపించారు. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు.
నిర్మాణం చివరి దశకు చేరుకున్నా అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు లంచాలకు అమ్ముడుపోయి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న స్థానికులు, అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మాణాన్ని నిలిపివేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.











