నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఆయన బలయ్యారని ఆమె ఆరోపించారు.
శంకర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే, సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను తట్టుకోలేక శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని ఆమె తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించడానికి వెళ్ళగా, ప్రభుత్వం అడ్డుకుందని కవిత ఆరోపించారు.
శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని, తెల్లవారేసరికి ఆయన మరణించినట్లు ప్రకటించారని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యేనని కవిత ఆరోపించారు.
శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు రూ. 2 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లను పునరుద్ధరించడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని ఆమె కోరారు.











