రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, ఏప్రిల్ 2వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామసభలకు అన్ని ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డితో కలిసి కలెక్టర్ పి.ప్రావీణ్య గ్రామసభల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి సభ ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక వివరాలను ముందుగానే సిద్ధం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆదేశించారు.
గ్రామసభలలో వ్యవసాయ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన వివిధ పథకాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, యాంత్రీకరణ, రేషన్ కార్డులు, చేయూత, మహాలక్ష్మి, గృహ జ్యోతి, మహిళా శక్తి, ఎస్‌హెచ్‌జీ రుణాలు, ఉపాధి హామీ పథకాలు వంటి వాటితో పాటు, ఇందిరమ్మ కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం వంటి కొత్త పథకాల వివరాలను కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
గ్రామసభలకు యువత, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, మహిళా సంఘాలు హాజరయ్యేలా ప్రోత్సహించాలని, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామసభల సమాచారాన్ని నోటీస్ బోర్డులు, దండోరా, పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, లబ్ధిదారుల జాబితాలు, కొత్త దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు, ఫీడ్‌బ్యాక్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారులు ప్రతి గ్రామపంచాయతీకి హాజరై పర్యవేక్షించాలని సూచించారు.












