బక్రీద్ పండుగను పురస్కరించుకుని, షాద్ నగర్ ప్రాంతంలో శాంతిభద్రతలను పటిష్టపరిచేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు, పట్టణ సరిహద్దులోని రాయికల్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
గోరక్షకులు చట్టాన్ని గౌరవించాలని, అక్రమ పశు రవాణాపై సమాచారం అందిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని ఏసీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. పండుగ వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
రాయికల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఏసీపీ లక్ష్మీనారాయణ స్వయంగా సందర్శించి, సిబ్బందికి సూచనలు అందించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సీతారాం కూడా అక్కడే ఉన్నారు.







