సిరిసిల్ల నూతన మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆమె, పన్నుల వసూలు, పారిశుధ్యం, అభివృద్ధి పనులపై అధికారులకు, సభ్యులకు పలు సూచనలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. నూతన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ అభినందనలు తెలిపి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అందరి సహకారంతోనే ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు.
బడ్జెట్ సమావేశంలో రెవెన్యూ వ్యయం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చుల గురించి కలెక్టర్ వివరించారు. తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కు రావాల్సిన పన్నులు 100 శాతం వసూలు చేస్తే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు.
వార్డు సభ్యులు ఇంటి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని, అన్ని షాపులు లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచించారు. ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు.
పార్కులు, వైకుంఠధామాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త చెరువులో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డీఆర్ సీసీ కేంద్రం, ఏబీసీ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. రగుడు జంక్షన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, అమృత్ పథకం కింద తాగునీటి సమస్యకు పరిష్కారం రానున్నదని వివరించారు. తాగునీటి సమస్య రాకుండా అధికారులు, సభ్యులు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.











