తెలంగాణ శాసనసభలో శుక్రవారం బీఆర్ఎస్ సభ్యులు రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ నిరసనల మధ్యనే ప్రభుత్వం రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించామని, హౌస్ కమిటీ అవసరం లేదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదని, ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వాలని సూచించారు.
తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతోందని, అయితే బీఆర్ఎస్ సభ్యులు సభ సజావుగా నడవకుండా అడ్డుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ వారికి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్పై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, సీఐడీతో పాటు హౌస్ కమిటీని కూడా వేయాలని ఆయన కోరారు. లేదంటే బీఆర్ఎస్ నేతలు గొడవ చేసి బిల్లుల ఆమోదానికి అడ్డుకుంటారని ఆయన అన్నారు.











