రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ప్రారంభం, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల సమస్యలు, యాసంగి ధాన్యం సేకరణ వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు అవసరమైన సమాచారంతో హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు ప్రకటించనుంది.
కొత్తగా ప్రవేశపెట్టనున్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'ను జూన్ 2న ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించనున్నారు. దీనికి రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై క్యాబినెట్లో చర్చ జరగనుంది.
మే నెలలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ప్రతిపాదించిన ఎమ్మెల్సీల అంశం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ, డీఏల చెల్లింపు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చాయి.
యాసంగి ధాన్యం సేకరణ, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టం, కుల సర్వే వివరాలపై ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రోహిత్ వేముల వివక్ష నిరోధక చట్టం వంటి అంశాలపై కూడా క్యాబినెట్ చర్చించనుంది.












