రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గారితో జరిగిన సమావేశంలో పిల్లల విద్య, పోషకాహార లోపాలపై చర్చించారు.
ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గారు రాష్ట్ర శాసన మండలి హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాస స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
చిన్న వయసులో పోషకాహార లోపం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను మురళీధరన్ గారు వివరించారు. వీటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు.
ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఈ అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీల్లో పోషకాహారం అందించేందుకు "పోషణ సఖి" పేరుతో అదనపు సిబ్బందిని నియమించే అవకాశముందని అధికారులు తెలిపారు.
మురళీధరన్ గారు సూచించిన అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రత్యేక నివేదికను సమర్పించాలని సూచించారు.











